SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 12:08 am Posted by : SALAM PRODDATUR

123 మున్సిపాలిటీలకు మహా అభివృద్ధి ప్యాకేజీ

–₹7,469.46 కోట్లతో పట్టణాల రూపురేఖలు మార్చే దిశగా ప్రభుత్వం

–4,388 కి.మీ రోడ్లు.. 541 కొత్త పార్కులు.. 20,340 వీధి దీపాలు

సలాం ప్రొద్దుటూరు అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.7,469.46 కోట్లతో భారీ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రహదారులు, డ్రైనేజీ, పార్కులు, వీధి దీపాలు, రోడ్ మీడియన్ల సుందరీకరణకు ఈ నిధులను వినియోగించనున్నారు.

4,388 కి.మీ రోడ్ల అభివృద్ధి

పట్టణాల్లో మిగిలిపోయిన 4,388 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపట్టి 100 శాతం రోడ్డు అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రహదారులతో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.4,655.82 కోట్లు కేటాయించారు.

పచ్చదనానికి పెద్దపీట

పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు 541 కొత్త పార్కుల అభివృద్ధికి రూ.509.12 కోట్లు కేటాయించారు. పార్కుల ఏర్పాటు, పచ్చదనం పెంపు ద్వారా పట్టణాల్లో పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వీధి దీపాలు.. మీడియన్ల సుందరీకరణ

పట్టణాల్లో రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు, ప్రజలకు భద్రత కల్పించేలా 20,340 నూతన వీధి దీపాల ఏర్పాటుకు రూ.247.28 కోట్లు కేటాయించారు. అలాగే 1,186 కిలోమీటర్ల రోడ్ మీడియన్ల సుందరీకరణకు రూ.87.78 కోట్లు వెచ్చించనున్నారు.

ఈ ప్రాజెక్టు అమలుతో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రహదారులు, పారిశుధ్యం, పచ్చదనం, వెలుగులు, సుందరీకరణ పరంగా గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. పట్టణ మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది.