–మూడు స్థాయిల పర్యవేక్షణతో సులభతర సేవలు
–విస్తీర్ణం ఆధారంగా అధికారులకు బాధ్యతలు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో వేగం
– ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
భవన నిర్మాణ అనుమతులు, పర్యవేక్షణ, తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను లెవల్-1, లెవల్-2, లెవల్-3 అనే మూడు స్థాయిల్లోనే పరిశీలించి నిర్ణయించేలా ఏకరీతి విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. దీంతో అనవసరమైన పరిపాలనా దశలను తగ్గించి, పౌరులకు పురపాలక సేవలను వేగంగా అందించే అవకాశం ఏర్పడిందన్నారు.గతంలో భవన విస్తీర్ణాన్ని బట్టి వివిధ స్థాయిల్లో ఫైళ్లు కదలడం, ఒక్కో విభాగంలో వేర్వేరు విధానాలు అమలులో ఉండటంతో తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరిగేదని తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు అన్ని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒకే విధమైన మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
విస్తీర్ణం ఆధారంగా అధికారుల బాధ్యతలు
కొత్త విధానంలో భవన విస్తీర్ణానికి అనుగుణంగా మూడు స్థాయిల్లో అధికారుల బాధ్యతలను ప్రభుత్వం నిర్దేశించింది.
– 100 చదరపు మీటర్ల వరకు: లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్/టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, లెవల్-3లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తారు.
– 100 నుంచి 200 చదరపు మీటర్ల వరకు: లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, లెవల్-3లో అసిస్టెంట్ సిటీ ప్లానర్/అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తారు.
– 200 నుంచి 300 చదరపు మీటర్ల వరకు: లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో అసిస్టెంట్ సిటీ ప్లానర్, లెవల్-3లో డిప్యూటీ సిటీ ప్లానర్/డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారు.
– 300 నుంచి 500 చదరపు మీటర్ల వరకు: లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో డిప్యూటీ సిటీ ప్లానర్, లెవల్-3లో సిటీ ప్లానర్/ప్లానింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తారు.
– 500 నుంచి 4,000 చదరపు మీటర్ల వరకు (హై రైజ్ భవనాలు మినహా): లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో సిటీ ప్లానర్, లెవల్-3లో చీఫ్ సిటీ ప్లానర్/చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిర్ణయాధికారులుగా ఉంటారు.
– 4,000 చదరపు మీటర్లకు పైగా (హై రైజ్ భవనాలు మినహా): లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేటరీ సెక్రటరీ, లెవల్-2లో చీఫ్ సిటీ ప్లానర్, లెవల్-3లో కమిషనర్/వైస్ చైర్పర్సన్/మెట్రోపాలిటన్ కమిషనర్ నిర్ణయాధికారులుగా వ్యవహరిస్తారు.
నియంత్రణలో రాజీ లేదు
కొత్త విధానం ద్వారా సేవలను సులభతరం చేసినప్పటికీ నియంత్రణ, పర్యవేక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసిందని కమిషనర్ తెలిపారు. నిర్దేశిత కేడర్ పోస్టు అందుబాటులో లేని సందర్భంలో తదుపరి ఉన్నతస్థాయి అధికారి సంబంధిత బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు.
సత్వర సేవలే ప్రభుత్వ లక్ష్యం
పౌరులకు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు తదితర సేవలను నిర్దేశిత గడువులోగా అందించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని కమిషనర్ పేర్కొన్నారు. పురపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, పౌరులకు అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
వేగం.. బాధ్యత.. పర్యవేక్షణ
కొత్త మూడు స్థాయిల విధానం ద్వారా వేగం, బాధ్యత, పర్యవేక్షణ మధ్య సమతూకం సాధ్యమవుతుందని తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రతి దశలో ఎవరి బాధ్యత ఏమిటో స్పష్టంగా ఉండటంతో ఫైళ్ల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని అన్నారు.పునరావృతమైన పరిపాలనా దశలు, అనవసరమైన స్థాయిలను తగ్గించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి సేవలో పారదర్శకత, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.