–సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
– మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
సలాం ప్రొద్దుటూరు:
పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో “స్వచ్ఛ సంకల్ప దీక్ష” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగడమే కాకుండా ప్రజారోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నివారించి, క్లాత్ బ్యాగులు, ఇతర పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు.
వ్యాపారులు సహకరించాలి
పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహితమైన బ్యాగులను వినియోగించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వినియోగదారులు కూడా ప్రతి వస్తువు కొనుగోలు సమయంలో ప్లాస్టిక్ కవర్ అడగకుండా, ఇంటి నుంచే క్లాత్ బ్యాగ్‌ను తీసుకెళ్లే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం
ప్లాస్టిక్ నివారణ అనేది కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములైనప్పుడే ప్లాస్టిక్ నియంత్రణలో ఆశించిన ఫలితాలను సాధించగలమన్నారు.సిడిఎంఏ (CDMA) ఆధ్వర్యంలో రూపొందించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ అవగాహన పోస్టర్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కోరారు.“సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పండి.. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరుకు చేయూతనివ్వండి” అని కమిషనర్ పిలుపునిచ్చారు.“మన ప్రొద్దుటూరు – మన బాధ్యత” అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, పరిశుభ్రమైన ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోరారు.