SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 2:36 pm Posted by : SALAM PRODDATUR

మహమ్మద్ ప్రవక్త ﷺ వంశీయుల నడుమ.. ఘనంగా శాంతి ర్యాలీ..

సలాం ప్రొద్దుటూరు –   జమ్మలమడుగు

మహమ్మద్ ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగు పట్టణంలో మీలాదున్నబీ వేడుకలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. ప్రవక్త వంశీయుల సాన్నిధ్యంలో వేలాది మంది ముస్లిం సోదరులు, చిన్నారులు పాల్గొన్న శాంతియుత ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మెయిన్ బజార్‌లోని జామియా మసీదు నుంచి ప్రారంభమైన ర్యాలీకి జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ భాషా ఖాద్రీ ఆధ్వర్యం వహించారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, అర్బన్ సీఐ నరేష్‌బాబు, డీఎస్పీ వెంకటేశ్వరరావులు ర్యాలీని ప్రారంభించారు.జామియా మసీదు నుంచి బయలుదేరిన ర్యాలీ కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ కూడలి, సంజామల మోటు, ఎంపీడీవో కార్యాలయం మీదుగా సాయిరాం థియేటర్ వరకు కొనసాగింది. అనంతరం పలగాడి మోటు, డొంకవీధి, గూడ మస్తాన్ దర్గా మీదుగా తిరిగి జామియా మసీదు వద్దకు చేరుకుంది.ఈ సందర్భంగా సాదిక్ భాషా ఖాద్రీతో పాటు గురువులు నయీమ్ పాషా ఖాద్రీ, గౌస్ భాషా ఖాద్రీలు మీలాదున్నబీ పండుగ విశిష్టతను, మహమ్మద్ ప్రవక్త ﷺ జీవిత సందేశాలను వివరించారు. ప్రేమ, దయ, సోదరభావం, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం ప్రవక్త ﷺ బోధనల్లో ప్రధానమైనవని పేర్కొన్నారు. సమాజంలో మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుత జీవనం సాగించాలని పిలుపునిచ్చారు.ర్యాలీ అనంతరం జామియా మసీదులో ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించి మీలాదున్నబీ పండుగ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ముస్లిం సోదరులు, చిన్నారులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో గురువులు నాజిమ్ పాషా ఖాద్రీ, తహసీన్ పాషా ఖాద్రీ, జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ షామీర్ భాష, షేక్ ఉస్మాన్ భాష, షేక్ మదార్ భాష, బేపారి మహమ్మద్ మజహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ముస్లిం సోదరులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని మీలాదున్నబీ శాంతి ర్యాలీని విజయవంతం చేశారు.