SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 4:15 pm Posted by : SALAM PRODDATUR

కడపలో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ శాంతి ర్యాలీ

–ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో భారీ జులూస్‌

–భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులు.. మానవ సేవా సందేశంతో ఉచిత రక్తదాన శిబిరం

సలాం ప్రొద్దుటూరు –  కడప:

మహా ప్రవక్త హజరత్‌ ముహమ్మద్‌ ముస్తఫా ﷺ వారి పవిత్ర జన్మదిన పర్వదినమైన మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఇష్క్‌-ఏ-రసూల్‌, భక్తిశ్రద్ధలు, సోదరభావం, శాంతి సందేశం ప్రతిబింబించేలా మహా జులూస్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ మర్కజి జులూస్‌ కమిటీ, కడప ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీకి పీఠాధిపతి మహమ్మద్‌ అలీ బాగ్దాది నాయకత్వం వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువత, మైనార్టీ నాయకులు పాల్గొని ప్రవక్త ﷺ పట్ల తమ అపారమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

ఇష్క్‌-ఏ-రసూల్‌తో కదిలిన జులూస్‌

స్థానిక అల్మాస్పేట నుంచి ప్రారంభమైన మహా జులూస్‌ అగాడి మీదుగా చిలకల బావి పరిసర ప్రాంతాలు, బహదూర్‌ఖాన్‌ మసీదు వీధి, చెన్నూరు బస్టాండ్‌, ఏడు రోడ్ల సర్కిల్‌, మద్రాస్‌ రోడ్డు, క్రిస్టియన్‌ లేన్‌ మీదుగా గుంత బజారులోని స్థానిక మసీదు వరకు కొనసాగింది. ర్యాలీ మార్గమంతా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ మహా ప్రవక్త ﷺ బోధనలు, శాంతి, ప్రేమ, దయ, సోదరభావ సందేశాలను స్మరించుకున్నారు. ర్యాలీ మధ్యలో ప్రవక్త ﷺను స్మరిస్తూ భక్తి నినాదాలు మార్మోగాయి.

మానవాళికి మార్గదర్శి మహా ప్రవక్త ﷺ

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్‌ మహమ్మద్‌ అలీ ఖాన్‌ మాట్లాడుతూ.. హజరత్‌ ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వమానవాళికి మహోపకారిగా అవతరించిన మహనీయులని అన్నారు. ప్రవక్త ﷺ జీవితం అల్లాహ్‌ ఆరాధన, ఐదు పూటల నమాజ్‌, పరోపకారం, త్యాగం, మానవ సేవకు అంకితమైందన్నారు.

పవిత్ర ఖుర్‌ఆన్‌ సందేశాన్ని ప్రపంచ మానవాళికి ప్రవక్త ﷺ ద్వారా అల్లాహ్‌ అందించారని పేర్కొన్నారు. ప్రవక్త ﷺ చూపిన సన్మార్గంలో నడుస్తూ ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, సేవా గుణాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

మిలాద్‌ సందేశానికి ప్రతీకగా రక్తదానం

మహా జులూస్‌ అనంతరం గుంత బజారులోని స్థానిక మసీదులో నిర్వాహకుల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ప్రవక్త ﷺ బోధించిన మానవతా విలువలను ఆచరణలో చూపించేలా రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా పలువురు మత గురువులు, పీఠాధిపతులు, మైనార్టీ నాయకులు మహా ప్రవక్త ﷺ పవిత్ర జీవితం, ఆయన బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను వివరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మయానరహంతుల్లా ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ ప్రతినిధి రఫీ ఖాన్‌, వివిధ పార్టీల మైనార్టీ నాయకులు, మత గురువులు, పీఠాధిపతులు, మత పెద్దలు, యువత, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.