
సలాం ప్రొద్దుటూరు:
మహమ్మద్ ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు పవిత్ర మిలాదున్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ విశ్వశాంతి ర్యాలీని బుధవారం ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు.అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ, ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ మైదుకూరు రోడ్డులోని నాజీరుల్లా షా ఖాద్రి దర్గా నుంచి ప్రారంభమై అసార్ షరీఫ్ వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని శాంతియుతంగా ముందుకు సాగారు. ప్రవక్త మహమ్మద్ ﷺ బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతిబింబించేలా ర్యాలీ సాగింది.ఈ సందర్భంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షులు, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ.. అల్లాహ్ మహమ్మద్ ప్రవక్త ﷺ ద్వారా పవిత్ర ఖురాన్‌ను ప్రపంచ మానవాళికి అందించారని తెలిపారు. ఖురాన్ కేవలం ఒక మతగ్రంథం మాత్రమే కాదని, మానవ జీవన విధానానికి అవసరమైన అనేక విలువలు, మార్గదర్శకాలను అందులో పొందుపరిచారని పేర్కొన్నారు.మానవాళి ఏ విధంగా నడుచుకోవాలి, సన్మార్గంలో ఎలా జీవించాలి, పరస్పరం ప్రేమ, గౌరవం, ఔదార్యంతో ఎలా మెలగాలి అనే విషయాలను ఖురాన్ స్పష్టంగా బోధిస్తుందని అన్నారు. మిలాదున్ నబీ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా నిర్వహించబడుతున్నాయని, ఈ పవిత్ర పండుగ ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, ఔదార్యంతో జీవించాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు.అలాగే ఆస్తానే జహురియా బిరాదరే పీఠాధిపతి సయ్యద్ షా మతీన్ హుస్సేనీ ఖాద్రి, పలు వూరు పీఠాధిపతులు పాల్గొన్నారు.అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ సెక్రటరీ ఇలియాస్ ఖురేషి, టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ ఉపాధ్యక్షులు కె. ఖలీల్ భాషా మాట్లాడుతూ ర్యాలీ విజయవంతానికి సహకరించిన అంజుమన్ కమిటీ సభ్యులు, మౌలీలు, మతపెద్దలు, నిర్వాహకులు, వేలాది మంది పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువల పరిరక్షణే మిలాదున్ నబీ సందేశమని చాటుతూ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

