SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 3:47 pm Posted by : SALAM PRODDATUR

కొర్రపాడులో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించాలి

 

–టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన టీడీపీ నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు – తిరుపతి (టీటీడీ):

ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొర్రపాడు గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని నిర్మించాలని కోరుతూ టీడీపీ నాయకులు మెట్టుపల్లె రామచంద్రారెడ్డి, ధనిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.

 

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సిఫారసు మేరకు టీటీడీ చైర్మన్‌ను కలిసి కొర్రపాడులో కళ్యాణ మండపం నిర్మాణం అవసరాన్ని వివరించినట్లు నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ మండపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

 

కొర్రపాడు గ్రామం, పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణ మండపం నిర్మాణానికి అనుకూల నిర్ణయం తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వారు కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.కళ్యాణ మండపం మంజూరైతే కొర్రపాడు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు సామాజిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సౌకర్యం కలగనుందని వారు పేర్కొన్నారు.