–ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం..
–ఏఐఎస్‌బీ జాతీయ కోఆర్డినేటర్ జాల జయవర్ధన్
సలాం ప్రొద్దుటూరు – నెల్లూరు:
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్‌బీ) జాతీయ కోఆర్డినేటర్ జాల జయవర్ధన్ ఆరోపించారు. సోమవారం నెల్లూరులో జరిగిన ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ప్రోత్సాహం కల్పిస్తున్నాయని జయవర్ధన్ విమర్శించారు. ముఖ్యంగా నీట్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమై విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. నీట్ సమస్యలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకంగా ఉన్న జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అమలు చేయలేదని జయవర్ధన్ అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సమస్యలు కొనసాగుతున్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య మరింత దూరమవుతోందని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయాలని కోరారు.విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే విద్యార్థులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లె పృథ్వీ, ఆర్థిక కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతులయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
