
–జామియా మసీదు నుంచి గంధం సమర్పణ..
–ప్రత్యేక ప్రార్థనలు చేసిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్
సలాం ప్రొద్దుటూరు:
మిలాద్-ఉన్-నబీ (స.అ) సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో సోమవారం రాత్రి గందోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని వివిధ ప్రముఖ మస్జిద్‌ల నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినీలను, గంధాన్ని భక్తిశ్రద్ధలతో అసార్-ఏ-షరీఫ్ వీధికి తీసుకొచ్చారు.
ప్రతి మస్జిద్ నుంచి పాల్గొన్న భక్తులు నడుచుకుంటూ దరూద్-ఏ-షరీఫ్, నాత్-ఏ-షరీఫ్, ఖసీదాలు పఠిస్తూ గంధాన్ని భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చారు. దీంతో అసార్-ఏ-షరీఫ్ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
జామియా మసీదు నుంచి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్, బేపారి ఆరిఫ్‌తో పాటు మసీదు కమిటీ సభ్యులు గంధోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముహమ్మద్ ప్రవక్త (స.అ)కు దరూద్-ఓ-సలాం సమర్పించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలని ప్రార్థించారు.
ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అంజుమన్ కమిటీ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో అసార్-ఏ-షరీఫ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ మస్జిద్‌ల నుంచి వచ్చిన చాందినీలతో ప్రాంతం సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని గందోత్సవాన్ని విజయవంతం చేశారు.
