SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 1:46 pm Posted by : SALAM PRODDATUR

మహమ్మద్‌ ప్రవక్త బోధనలతోనే సమాజంలో సమానత్వం

 

–మహిళలకు గౌరవం.. పేదలకు ఆత్మగౌరవం.. మానవత్వానికి మార్గదర్శకం

–మీలాదున్నబీ శాంతి ర్యాలీని విజయవంతం చేయండి

— జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్‌ షా సాదిక్‌పాషా ఖాద్రి పిలుపు

 

సలాం ప్రొద్దుటూరు –  జమ్మలమడుగు:

మహమ్మద్‌ ప్రవక్త బోధనలు సమాజంలో సమానత్వం, న్యాయం, మానవత్వానికి బలమైన పునాది వేశాయని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్‌ షా సాదిక్‌ పాషా ఖాద్రి అన్నారు. మహిళలు, పేదలు, అణగారిన వర్గాల పట్ల గౌరవం, హక్కులు, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రపంచానికి ప్రవక్త చాటి చెప్పారని పేర్కొన్నారు.మీలాదున్నబీ పండుగ సందర్భంగా ఈ నెల 26న నిర్వహించనున్న శాంతి ర్యాలీ, ప్రత్యేక ప్రార్థనలు, పవిత్ర జ్ఞాపికల దర్శనం కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సోమవారం జామియా మసీదులో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ మహమ్మద్‌ ప్రవక్తకు ముందు సమాజంలో మహిళలు, పేదలు, అణగారిన వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రవక్త బోధించిన సన్మార్గం, మానవతా విలువలతో సమాజంలో మంచి చెడుల మధ్య తేడాను తెలుసుకుని న్యాయబద్ధంగా జీవించే మార్గం ఏర్పడిందన్నారు.మహిళలపై అన్యాయాలు, అమానుష చర్యలకు వ్యతిరేకంగా నిలిచి వారికి గౌరవం, హక్కులు కల్పించే సందేశాన్ని ప్రవక్త అందించారని తెలిపారు. పేదలు కూడా సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా మానవ సమానత్వాన్ని బోధించారని చెప్పారు.ప్రవక్త జీవితంలోని ఆదర్శాలు, బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మీలాదున్నబీ వేడుకలను నిర్వహిస్తూ ప్రవక్త బోధనలను స్మరించుకుంటున్నామని తెలిపారు.ఈ నెల 26వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు నమాజ్‌ అనంతరం మహమ్మద్‌ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలను భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు తెలిపారు. అనంతరం వేలాది మంది భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ముస్లిం సోదర సోదరీమణులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మీలాదున్నబీ వేడుకలు, శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని సయ్యద్‌ షా సాదిక్‌ పాషా ఖాద్రి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గురువులు మోసిన్‌ పాషా ఖాద్రి, జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్‌ షామీర్‌ భాష, షేక్‌ మదార్‌ భాష, షేక్‌ ఉస్మాన్‌ భాష, డంకా యస్దాని భాష, పఠాన్‌ బాబుల్‌ ఖాన్, హాఫీజ్‌, షేక్‌ షావల్లి తదితరులు, మసీదు ముసల్లీలు పాల్గొన్నారు.