SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:31 pm Posted by : SALAM PRODDATUR

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

–సమగ్ర విచారణ చేపట్టాలి.. ఉల్లంఘనలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి

–ప్రగతిశీల విద్యార్థి సమైక్య (PSF) రాష్ట్ర అధ్యక్షుడు కొడవటికంటి నాగరాజు

సలాం ప్రొద్దుటూరు –  కడప:

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నర్సింగ్ కళాశాలలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సమైక్య (PSF) రాష్ట్ర అధ్యక్షుడు కొడవటికంటి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మల్లికార్జున నాయుడుకు PSF ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.కడప జిల్లాలో కొన్ని నర్సింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నాగరాజు తెలిపారు. ముఖ్యంగా ఒకే భవనం లేదా క్యాంపస్‌లో రెండు, మూడు నర్సింగ్ కళాశాలలు నిర్వహిస్తున్న సందర్భాల్లో ఆయా కళాశాలలకు ఉన్న అనుమతులు, మౌలిక వసతులు, సీట్ల సామర్థ్యం, అఫిలియేషన్ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.ప్రతి నర్సింగ్ కళాశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC), ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్, సంబంధిత యూనివర్సిటీతో పాటు వర్తించే ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గుర్తింపు, సూటబిలిటీ, అఫిలియేషన్, అనుమతించిన సీట్ల సంఖ్యతో పాటు తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీ, బోధనా సిబ్బంది, క్లినికల్ శిక్షణ, ఆసుపత్రి సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పరిశీలించకుండా సంబంధిత శాఖల అధికారులతో సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు తేలితే సంబంధిత నియంత్రణ సంస్థలకు నివేదించి, వర్తించే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధంగా విద్యా ప్రమాణాలను పక్కనపెట్టి కళాశాలలను నిర్వహిస్తే సహించేది లేదని నాగరాజు హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల కోసం PSF నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, సమస్యపై అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హరి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.