–15 విమానాలు దారి మళ్లింపు..
–రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్
–రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
సలాం ప్రొద్దుటూరు – న్యూఢిల్లీ :
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో జనజీవనం స్తంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 15 విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.
దారి మళ్లించిన విమానాల్లో 12 విమానాలను జైపూర్‌కు, రెండు విమానాలను చండీగఢ్‌కు, ఒక విమానాన్ని లక్నోకు మళ్లించారు. వీటిలో మూడు అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లలో జాప్యం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ముఖ్య రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
విమాన ప్రయాణికులు తమ విమానాల ప్రస్తుత స్థితిని ముందుగానే పరిశీలించి, విమానాశ్రయానికి అదనపు సమయం కేటాయించి బయలుదేరాలని విమానయాన సంస్థలు సూచించాయి.