SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 4:16 pm Posted by : SALAM PRODDATUR

సచివాలయ ఉద్యోగుల సెన్సెస్ రెమ్యూనరేషన్ జమపై స్పందించిన కమిషనర్

 

సలాం ప్రొద్దుటూరు:

సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సెన్సెస్ రెమ్యూనరేషన్‌ను వెంటనే వారి ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకున్న కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సెన్సెస్ రెమ్యూనరేషన్ చుట్టుపక్కల ఉన్న రూరల్, అర్బన్ ప్రాంతాల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినప్పటికీ, ప్రొద్దుటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగులకు ఇంకా జమ కాలేదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.

 

దీనిపై వెంటనే స్పందించిన కమిషనర్ టీపీఓ సెక్షన్ అధికారులను ఫోన్‌లో సంప్రదించి, ప్రొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల రెమ్యూనరేషన్ ఎందుకు జమ కాలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన టీపీఓ అధికారి, సంబంధిత మొత్తం ఇండియన్ బ్యాంకులో జమ అయిందని, సోమవారం సాయంత్రంలోపు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతపురం ఆర్‌డీ కార్యాలయం నుంచి కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ ప్రొద్దుటూరుకు వచ్చిన అనంతరం శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్, వైస్ ప్రెసిడెంట్ నాగార్జున ఆయనను కలిసి సమస్యను వివరించారు. సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న కమిషనర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.