సలాం ప్రొద్దుటూరు – అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామపంచాయతీలు,మండల ప్రజా పరిషత్‌లు,జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తూ పంచాయతీరాజ్ శాఖ G.O.Ms.No.105,తేదీ:20-08-2026న ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో అమల్లో ఉన్న 34 శాతం బీసీ రిజర్వేషన్ కొన్ని పరిణామాల నేపథ్యంలో 24.15 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే.తాజా ఉత్తర్వులతో బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరగనుంది.ఈ 34 శాతం రిజర్వేషన్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు,సర్పంచ్,మండల ప్రజా పరిషత్(MPTC)సభ్యులు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు,జిల్లా ప్రజా పరిషత్(ZPTC)సభ్యులు,జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ పదవులకు వర్తించనుంది.రిజర్వేషన్ల కేటాయింపును రొటేషన్,మహిళల రిజర్వేషన్‌తో పాటు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994,సంబంధిత నిబంధనలు,అమల్లో ఉన్న న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది.తదుపరి అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ కమిషనర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.తాజా ఉత్తర్వులతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమమైంది.ఈ నిర్ణయం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై రాజకీయంగా,సామాజికంగా కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.