సలాం ప్రొద్దుటూరు – చెన్నై, :
తెలుగు చిత్రసీమలో తనదైన నటనా ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (95) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె తెలుగు, తమిళం తదితర భాషల్లో వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.
రాజమండ్రిలో జననం.. మద్రాసులో బాల్యం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జానకి 1931 డిసెంబర్ 12న జన్మించారు. శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు జన్మించిన ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారిలో ప్రముఖ నటి కృష్ణకుమారి కూడా ఉన్నారు. ఆమె తండ్రి రాజమండ్రిలో ప్రభుత్వ పేపర్ ఎక్స్‌పర్ట్, కెమికల్ ఇంజినీర్‌గా పనిచేశారు.తండ్రి ఉద్యోగరీత్యా 1944లో కుటుంబం మద్రాసుకు వెళ్లింది. అక్కడ జానకి ఆల్ ఇండియా రేడియోలో చిన్నారుల కార్యక్రమాల్లో పాల్గొంటూ కళారంగంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. రేడియో ద్వారా ఏర్పడిన పరిచయాలు ఆమెను సినీ రంగం వైపు నడిపించాయి.
‘షావుకారు’తో సినీ ప్రస్థానం
1947 నవంబర్ 5న శంకరమంచి శ్రీనివాసరావుతో జానకికి వివాహం జరిగింది. అనంతరం ఆమె సినిమాల్లోకి ప్రవేశించారు. విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘షావుకారు’ చిత్రంతో 1950లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమెకు ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మారింది.తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో జానకి దాదాపు 380 చిత్రాల్లో నటించారు. కథానాయికగా మాత్రమే కాకుండా తల్లి, అత్త, బామ్మ, సహాయక పాత్రలు సహా అనేక విభిన్న పాత్రల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. సహజ నటన, హావభావాలు, పాత్రకు అనుగుణంగా తనను తాను మలుచుకునే ప్రత్యేకత ఆమెను ప్రత్యేకమైన నటిగా నిలబెట్టాయి.
2023లో చివరి చిత్రం
సుమారు 73 ఏళ్లపాటు సాగిన ఆమె సినీ ప్రస్థానంలో పలు తరాల నటీనటులతో కలిసి పనిచేశారు. 2023లో విడుదలైన ‘అన్ని మంచి శకునములే’ ఆమె నటించిన చివరి చిత్రంగా నిలిచింది. జానకి మృతి తెలుగు, దక్షిణాది చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.