SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:18 pm Posted by : SALAM PRODDATUR

“వైసీపీని ఎండగట్టడం కాదు.. అక్టోబర్‌లో ప్రజలే మిమ్మల్ని ఊరగాయ పెడతారు!” — రాచమల్లు

–నారా లోకేష్‌ పై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు..

సలాం   ప్రొద్దుటూరు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నాయకులను ఎండగట్టడం కాదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబు, లోకేష్‌లకు తగిన సమాధానం చెబుతారని అన్నారు. దొరసానిపల్లె లోని మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం  పాత్రికేయుల  సమావేశంలో రాచమల్లు మాట్లాడారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసంలో తెల్లవారుజామున ఈడీ సోదాలు నిర్వహించడం ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2019–2024 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో 23,609 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, సుమారు 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలను కూడా భర్తీ చేశామని తెలిపారు.అప్పటి నియామకాల్లో పారదర్శకత పాటించామని, టీడీపీ నేతల నుంచి సైతం పెద్దఎత్తున ఆరోపణలు రాలేదని రాచమల్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పరీక్ష నిర్వహించకుండానే కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా 300కుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రత్యేక జీవోలు తీసుకువచ్చారని విమర్శించారు.ప్రస్తుత ప్రభుత్వం 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పదేపదే ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లోనూ అవినీతి జరిగిందని, ఒక్కో ఉద్యోగానికి భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు చేశారు.తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడలేని నారా లోకేష్‌.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాచమల్లు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తమ తీర్పుతో టీడీపీ కూటమికి సమాధానం చెబుతారని అన్నారు.