– ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా
సలాం ప్రొద్దుటూరు:
దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ అని ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు.రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని 21వ శతాబ్దానికి సిద్ధం చేసేందుకు అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.కంప్యూటర్, ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశంలో సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు అరుదైన టెలిఫోన్ సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, STD, ISD, PCOల విస్తరణ, పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం వంటి నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాల్లో సాంకేతికతను చేరువ చేశాయని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవడం, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు రిజర్వేషన్లకు మార్గం సుగమం చేయడం వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఇర్ఫాన్ బాషా తెలిపారు.“భవిష్యత్తును నిర్మించాలంటే యువతపై నమ్మకం ఉంచాలి” అనే ఆలోచనతో రాజీవ్ గాంధీ ముందుకు సాగారని, నేటి డిజిటల్ భారతానికి అప్పట్లో ఆయన వేసిన పునాదులు ఎంతో కీలకమని అన్నారు.రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే సద్భావనా దినోత్సవం కేవలం ఒక స్మరణ కార్యక్రమంగా కాకుండా.. శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, జాతీయ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సిన రోజుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని, సాంకేతికతను సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ సమైక్య, ప్రగతిశీల, ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇర్ఫాన్ బాషా పిలుపునిచ్చారు.
