SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 11:09 pm Posted by : SALAM PRODDATUR

మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకటించాలి

 

–ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్

 

సలాం ప్రొద్దుటూరు –  గుంటూరు :

రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించి ఇంటరిమ్ రిలీఫ్‌ (ఐఆర్) మంజూరు చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే ఆప్కాస్‌ ఉద్యోగుల నియామకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి, ఆప్కాస్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని కోరింది.గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో  ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. శంకర్రావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రవికుమార్‌  వెల్లడించారు.రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు గత ఏడేళ్లుగా వేతనాలు పెరగలేదని సమావేశం పేర్కొంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. కాలపరిమితి ముగిసిన 11వ పీఆర్సీ స్థానంలో తక్షణమే 12వ పీఆర్సీని ప్రకటించి, ఐఆర్‌ మంజూరు చేయాలని డిమాండ్ చేసింది.అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.

 

ఆప్కాస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

 

ఆప్కాస్‌ ఉద్యోగుల నియామకాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇటీవల వివిధ మున్సిపాలిటీల్లో నియమించబడిన సుమారు 7 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలని కోరింది.ఆప్కాస్‌ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని గతంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయలేదని సమావేశం ఆరోపించింది. ఇప్పటికైనా ఆప్కాస్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేసింది.

ఉద్యమాలకు సిద్ధం

 

మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగులు, ఆప్కాస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో 12వ పీఆర్సీ సాధన కోసం జరుగుతున్న రాష్ట్రస్థాయి ఉద్యమాల్లో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పి. అబ్రహం లింకన్, జి. మధుబాబు, బి. సోమయ్యతో పాటు గుంటూరు, అన్నమయ్య, అనంతపురం, కడప, ఏలూరు తదితర జిల్లాలకు చెందిన శివశ్రీ, అంకాలమ్మ, సువార్తమ్మ, ఏడుకొండలు, నాగరాజు, ఓబులేసు, అజయ్ కుమార్, రాయుడు, బాలు, రాము, రేలంగి నాగరాజు, లావేటి కృష్ణారావు, జి. బాలు, బంగారు వెంకటేశ్వరరావు, మాత్రపు తంబి, పంతం చిన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.