SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:54 pm Posted by : SALAM PRODDATUR

సభాపతి స్థానంలో వరదరాజులరెడ్డి.. ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణుల్లో హర్షం

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎన్నో ఏళ్ల తర్వాత అసెంబ్లీ ప్యానెల్‌ స్పీకర్‌ పదవి దక్కడం పట్ల నియోజకవర్గ ప్రజలు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్యానెల్‌ స్పీకర్‌గా వ్యవహరిస్తూ గురువారం అసెంబ్లీలో సభాపతి స్థానంలో ఆసీనులై సభా కార్యక్రమాలను నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్‌ స్థానంలో వరదరాజులరెడ్డి కూర్చొని సభను నడిపించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ప్రొద్దుటూరు నియోజక వర్గంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. తమ ఎమ్మెల్యే సభాపతి స్థానంలో కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు. ప్యానెల్‌ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వరదరాజులరెడ్డి సభలో సభ్యుల ప్రసంగాలు, చర్చలను పర్యవేక్షించారు. సభా వ్యవహారాలను నిబంధనల మేరకు కొనసాగిస్తూ స్పీకర్‌ స్థానంలో తనదైన శైలిలో వ్యవహరించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు ఈ అవకాశం లభించడం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ప్రత్యేక సందర్భమని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభలో కీలకమైన సభాపతి స్థానంలో ఆసీనులు కావడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి ప్యానెల్‌ స్పీకర్‌ అవకాశం రావడం, అందులో భాగంగా వరదరాజులరెడ్డి అసెంబ్లీని నడిపించడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా భావిస్తున్నారు.

“మన ఎమ్మెల్యే.. సభాపతి స్థానంలో” అంటూ తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల్లో వరదరాజులరెడ్డి సభాపతి స్థానంలో కనిపించడంతో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలను పంచుకున్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు ఇలాంటి కీలక బాధ్యత దక్కడం ప్రొద్దుటూరుకు గౌరవంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్యానెల్‌ స్పీకర్‌గా వరదరాజులరెడ్డి సభను నడిపించిన దృశ్యాలు ప్రస్తుతం ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఇప్పుడు సభాపతి స్థానంలో కూర్చొని సభా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం రావడం పట్ల ఆయన అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.