SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 2:52 pm Posted by : SALAM PRODDATUR

మార్పు మొదలైంది.. రెండు నెలల్లో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు!

 

–ప్రజల సహకారంతో స్వచ్ఛమైన, సుందరమైన ప్రొద్దుటూరును నిర్మిస్తాం– కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్

 

సలాం   ప్రొద్దుటూరు:

“మార్పు మొదలైంది.. ప్రజలు కోరుకుంటే ఏదైనా సాధ్యమే” అంటూ ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరు నిర్మాణమే లక్ష్యంగా మున్సిపాలిటీ ముందుకు సాగుతోందని తెలిపారు.

 

పట్టణంలోని వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగంపై ఆలోచించడం ప్రారంభించారని, ఇదే మార్పుకు తొలి అడుగు అని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై తమ ఇళ్లలో, దుకాణాల్లో, వివాహాలు, శుభకార్యాలు, పండుగల సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

 

కాలువలు, డ్రైనేజీల్లో చెత్త వేయొద్దు

 

ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థాలను కాలువలు, డ్రైనేజీల్లో వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా వర్షాకాలంలో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ చెత్తను బాధ్యతగా నిర్వహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

 

“రెండు నెలల్లో మార్పు కనిపించేలా కృషి చేస్తా”

 

“నేను మాట ఇస్తున్నాను.. కేవలం రెండు నెలల్లో మీరు కోరుకునే ప్రొద్దుటూరును చూసేలా కృషి చేస్తాను. మార్పు ఒక్కరోజులో రాదు.. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. మా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి.. చేతులు జోడించి కోరుతున్నాను” అని కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ భావోద్వేగంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ప్రొద్దుటూరును కేవలం ప్లాస్టిక్ రహిత పట్టణంగానే కాకుండా స్వచ్ఛమైన, సుందరమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

“మన పట్టణం మారాలి అంటే ముందు మన ఆలోచన మారాలి.. మన అలవాట్లు మారాలి. మనందరం కలిసి అడుగు వేస్తే ప్రొద్దుటూరు మార్పుకు ఆదర్శంగా నిలుస్తుంది.”