SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 7:29 pm Posted by : SALAM PRODDATUR

త్రాగునీటి సమస్యలపై వార్డు అమినిటీస్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్ష

 

–ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణంలో త్రాగునీటి సరఫరా, నాణ్యతకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ వార్డు అమినిటీస్ సెక్రటరీలను ఆదేశించారు. సోమవారం వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందితో త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డు అమినిటీస్ సెక్రటరీ తప్పనిసరిగా ప్రజా ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. సచివాలయ పరిధిలో ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షించాలని, తాగునీరు కలుషితమవుతోందా, దుర్వాసన వస్తుందా, నిర్ణీత సమయానికి నీటి సరఫరా జరుగుతోందా అనే అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.అలాగే సచివాలయ పరిధిలో అవసరమైన అమినిటీస్ అందుబాటులో ఉన్నాయా, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తున్నారా అనే అంశాలపై వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ ప్రశ్నించారు.ప్రజలకు త్రాగునీటి సమస్య ఎదురైతే సంబంధిత వార్డు అమినిటీస్ సెక్రటరీలు బాధ్యత వహించాలని, ఫిర్యాదు అందిన వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి వారం త్రాగునీటి సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.వర్క్‌చార్ట్‌ను తప్పనిసరిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, త్రాగునీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించి నాణ్యతను పరీక్షించాలని సూచించారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా వార్డు అమినిటీస్ సెక్రటరీలు సమర్థవంతంగా పనిచేయాలని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆదేశించారు.ఈ సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.