SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:16 pm Posted by : SALAM PRODDATUR

గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం.. ముగ్గురు గల్లంతు

 

 

–రాజమహేంద్రవరంలో విషాద ఘటన — బాలుడిని రక్షించిన మత్స్యకారులు

 

సలాం ప్రొద్దుటూరు –   రాజమహేంద్రవరం:

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతుకాగా, ఓ బాలుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.

 

మత్స్యకారుల చొరవతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది

 

పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34), మనవడు కలిసి కారులో వంతెనపైకి చేరుకున్నట్లు సమాచారం. అనంతరం నలుగురూ గోదావరి నదిలోకి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన సమీపంలోని మత్స్యకారులు వెంటనే స్పందించి పడవలతో గాలింపు చేపట్టారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

 

ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం

 

నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ముగ్గురి ఆచూకీ కోసం గోదావరిలో విస్తృతంగా గాలిస్తున్నారు.

 

కుటుంబ సభ్యులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.