SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:23 pm Posted by : SALAM PRODDATUR

గంటలోనే బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన కదిరి పోలీసులు

 

 

–డయల్‌ 100 ఫిర్యాదుపై వేగంగా స్పందన.. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

 

సలాం ప్రొద్దుటూరు –    కదిరి:

కదిరి పట్టణంలోని వలీసాబ్‌ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన ఘటనపై కదిరి టౌన్‌ పోలీసులు వేగంగా స్పందించి గంటలోపే బాలుడిని గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

 

సోమవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటల సమయంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించడంతో పాటు కదిరి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో బ్లూకోర్ట్‌ సిబ్బంది పీసీ నంబర్‌ 2541 రమేష్‌, 271 రఫీ రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కోసం పట్టణంలో విస్తృతంగా గాలించారు.

 

ఈ క్రమంలో కదిరి పట్టణంలోని ఓ పండ్ల బండి వద్ద బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న బాలుడిని ఓ మహిళ గుర్తించి తన వద్దకు తీసుకుని, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సురక్షితంగా ఉంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని క్షేమంగా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

 

అనంతరం సీఐ వెంకటేశ్వర్లు సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన తమ కుమారుడిని గంటలోపే గుర్తించి క్షేమంగా అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చిన్నారులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, పిల్లల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.

 

బాలుడి మిస్సింగ్‌ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టి గంటలోపే బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన కదిరి టౌన్‌ పోలీసుల సేవలను డీఎస్పీ, సీఐ అభినందించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.