సలాం ప్రొద్దుటూరు:
శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో లోకకల్యాణార్థం, శుభఫలాల కోసం, భక్తుల కోరికలు నెరవేరాలని నిర్వహించే హోమాలను ఇకపై శాస్త్రోక్తంగా యాగశాలలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు ఆలయ ముఖ మండపం సమీపంలో హోమాలు నిర్వహిస్తుండటంతో భక్తులకు కొంత అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో, ఆలయ ఆగ్నేయ దిశలో ప్రత్యేక యాగశాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్వామివారి అనుగ్రహంతో యాగశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈఓ కె.వి. రమణ ఆధ్వర్యంలో, పాలకమండలి సభ్యుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం జరిగింది. శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించేందుకు యాగశాల నిర్మాణం భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.అదేవిధంగా సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారు, అమ్మవార్లకు ఆలయంలో ప్రత్యేక సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వి. రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
