–MPJ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ సలీం భాషా
సలాం ప్రొద్దుటూరు:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన MPJ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ సలీం భాషా మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కేవలం అధికార మార్పిడి కాదని, కోట్లాది ప్రజల త్యాగాలు, పోరాటాలు, రక్తతర్పణంతో సాధించిన మహత్తర విజయమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు సహా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడారని గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ముస్లిం సమాజానికి చెందిన అనేక మంది సమరయోధులు సైతం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు.“జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదు.. అది మన స్వాతంత్ర్యానికి, జాతీయ ఐక్యతకు, రాజ్యాంగ విలువలకు ప్రతీక” అని షేక్ సలీం భాషా అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, మత స్వేచ్ఛ వంటి హక్కులను కల్పించిందని, ఈ విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు.
MPJ రాయలసీమ ఇన్‌చార్జ్ డాక్టర్ ఎం.డి. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదన్నారు. పేదలకు న్యాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి, మహిళలకు భద్రత, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో MPJ జిల్లా ఇన్‌చార్జ్ జాకీర్ ఉమ్రి, MPJ పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి హుస్సేన్ భాషా, రఫీక్, ఇస్మాయిల్, ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, రవి, ఎస్.పీ. ముక్తియార్, గౌస్ లాజం, సయ్యద్ ఫరాన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
