SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:30 pm Posted by : SALAM PRODDATUR

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల భారీ ప్రదర్శన

 

–2029లో దళిత వ్యతిరేకుల పీఠాలు కదిలిస్తాం: మల్లెల వెంకటరావు

 

సలాం ప్రొద్దుటూరు –   జమ్మలమడుగు:

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగులో ఆదివారం భారీ ర్యాలీ, ఆత్మీయ సమావేశం, బహిరంగ సభ నిర్వహించారు. మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో భాగంగా తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్ సమీపంలోని ఎల్‌ఎంసీ ప్రాంగణంలో వెంకటస్వామి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం, బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లెల వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల దళితుల హక్కులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు. 2029 ఎన్నికల్లో దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న శక్తులకు ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామని పేర్కొన్నారు. దళిత హక్కుల పరిరక్షణ కోసం జమ్మలమడుగు నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు.అలాగే దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించాలని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు అనుగుణంగా దళితుల హక్కులను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమ్మానియేల్, సురేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ చింతకుంట సురేంద్ర, నాయకులు మంత్రి శీను, సంగటి మనోహర్, దేవదానం, ఉప్పలపాటి యోబు, అవిస శ్రీనివాసులు, పట్నం ఆల్ఫ్రెడ్, గంధం బాబు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మాల సామాజికవర్గ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.