SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 8:09 pm Posted by : SALAM PRODDATUR

జీవనజ్యోతి విద్యాసంస్థల్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

 

–జాతీయ జెండా ఎగురవేసిన అమర్నాథ్ రెడ్డి.. ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు పట్టణంలోని జీవనజ్యోతి విద్యాసంస్థల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల ప్రాంగణాలు జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలతో సందడిగా మారాయి.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవనజ్యోతి విద్యాసంస్థల యజమాని అమర్నాథ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు జాతీయ పతాకానికి వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా జీవనజ్యోతి విద్యాసంస్థల అన్ని బ్రాంచీలలో విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు ఉత్సాహంగా చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సేవకు సంబంధించిన సందేశాలను అందించారు. పాఠశాల ప్రాంగణాలు ‘వందేమాతరం’, ‘జైహింద్’ నినాదాలతో మార్మోగాయి.ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, జాతీయ సమైక్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. వేడుకల్లో పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.