SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 1:27 pm Posted by : SALAM PRODDATUR

 “ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’”–మున్సిపల్ కమిషనర్

 

–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం స్వచ్ఛ సంకల్పం

 

–ఆగస్టు 15న వేలాది మందితో జనసంకల్ప కార్యక్రమం

 

సలాం ప్రొద్దుటూరు:

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును ఆవిష్కరించేందుకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్యంతో ‘స్వచ్ఛ సంకల్ప దీక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ వినియోగాన్ని పట్టణం నుంచి పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

 

ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్‌ గ్రౌండ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో స్వచ్ఛ సంకల్ప దీక్ష నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. భవితరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టణ ప్రజలతో కలిసి ‘ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు’ కోసం జనసంకల్పం చేయించనున్నారు.

 

ప్రజలందరికీ ఆత్మీయ ఆహ్వానం

 

స్వచ్ఛ సంకల్ప దీక్షలో పట్టణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజా నాయకులు, అడ్వైజరీ కమిటీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, పౌర సంఘాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, దుకాణదారులు, వర్తక-వ్యాపార వర్గాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పురపాలక సంఘం ఆహ్వానించింది.

 

ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ, ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా స్వీకరించి, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

 

“మన ప్రొద్దుటూరు – మన బాధ్యత.. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు – మన సంకల్పం” అనే స్ఫూర్తితో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, MBA, LLM, మాజీ సైనికుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.