సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు):
జమ్మలమడుగు పట్టణానికి సమీపంలోని పెన్నా నది తీరంలో పొన్నతోటలో ఉన్న నబిషా ఖాద్రి స్వామి దర్గా తరతరాలుగా భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రంగా కొనసాగుతోంది. స్థానికంగా ఈ ప్రాంతాన్ని, స్వామివారి ఆధ్యాత్మిక పరంపరను ప్రత్యేకమైన పేర్లతో భక్తులు స్మరించుకుంటూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు.
కాలం మారుతున్నా ఆధ్యాత్మిక సంప్రదాయాలను, పూర్వీకులు పాటించిన ఆచారాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది గందోత్సవాన్ని నిర్వహించడం విశేషమని వారు పేర్కొన్నారు.
ఫాతిహా.. సర్వమానవ శాంతికి ప్రార్థనలు
గంధం సమర్పించిన అనంతరం ఫాతిహా నిర్వహించారు. సర్వమానవులు సుఖశాంతులతో ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి దర్గాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆస్థానే కమలియా జామియా మసీదు, జమ్మలమడుగు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హాజరైన భక్తులకు ఆశీస్సులు అందిస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
సూఫీ సంప్రదాయంలో మానవతకు పెద్దపీట
నబిషా ఖాద్రి స్వామి గొప్ప ఆధ్యాత్మికవేత్త, సూఫీ గురువు, మానవతావాది అని పీఠాధిపతులు కొనియాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆధ్యాత్మిక ధైర్యాన్ని అందించడం, మానవ సేవ, ప్రేమ, సోదరభావం వంటి విలువలను చాటిచెప్పడం సూఫీ సంప్రదాయంలోని ప్రధాన సందేశాలని పేర్కొన్నారు.
కష్టాలు ఎదురైనప్పుడు స్వామివారిని స్మరించి ప్రార్థనలు చేసుకుంటే అల్లాహ్, మహమ్మద్ ప్రవక్త (స) ఆశీస్సులతో మనోధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసమని తెలిపారు.
వేలాదిగా భక్తుల రాక.. అన్నదానం
గందోత్సవానికి జమ్మలమడుగుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ గందోత్సవంలో హజరత్ సయ్యద్ షా నయీమ్ పాషా ఖాద్రి, సయ్యద్ షా అహ్మద్ పాషా ఖాద్రి, సయ్యద్ షా కాశిఫ్ పాషా ఖాద్రి, సయ్యద్ షా అతీఫ్ పాషా ఖాద్రి పీఠాధిపతుల ఆధ్వర్యంలో గంథం జరిగింది.
ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ, తరతరాల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న సయ్యద్ షా నబిషా ఖాద్రి గందోత్సవం జమ్మలమడుగు ప్రాంత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యానికి ప్రతిబింబంగా నిలిచింది.
