–మున్సిపల్ కార్మికుడి మృతికి సంతాపం.. అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేల సాయం
సలాం ప్రొద్దుటూరు:
కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని చాటుతూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మానవీయతను చాటుకున్నారు. పురపాలక సంఘంలో సేవలందిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన వెంకటరమణ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు.
వెంకటరమణ మృతి విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కమిషనర్ స్వయంగా వెంకటరమణ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందించి, ఈ విషాద సమయంలో కుటుంబానికి మున్సిపల్ యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
కార్మిక కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ
పట్టణ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవాలన్నదే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. వెంకటరమణ కుటుంబానికి తక్షణ సహాయం అందేలా ఎమ్మెల్యే స్పందించిన తీరు అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సూపర్‌వైజర్ నూర్‌బాషా, యూనియన్ నాయకులు పట్టణ అధ్యక్షుడు చంటి, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్, పట్టణ కమిటీ సభ్యుడు శ్రీకాంత్, ఆదర్శ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.