
–ప్రొద్దుటూరులో 53 మంది లబ్ధిదారులకు రూ.52.62 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సలాం ప్రొద్దుటూరు:
పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సమయంలో అయ్యే భారీ వైద్య ఖర్చులను కొంతమేర భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు.శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి 30వ విడత చెక్కులను 53 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52,62,020 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలు ఇప్పటికే పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో, వారికి కొంత ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించడం అభినందనీయమన్నారు. వైద్య చికిత్స అనంతరం కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రెండేళ్లలో రూ.11.87 కోట్లకు పైగా సాయం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత రెండేళ్ల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 30 విడతల్లో 1,355 మంది లబ్ధిదారులకు రూ.11,87,70,589 మేర సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీఎం సహాయనిధి ద్వారా అత్యధిక మొత్తంలో సహాయం అందుతున్న నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు 2 లేదా 3వ స్థానంలో ఉండటం గమనార్హమని పేర్కొన్నారు.వైద్య చికిత్స కోసం భారీగా ఖర్చు చేసిన అర్హులైన బాధిత కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు బచ్చల పుల్లయ్య, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్ల శ్రీనివాసాచారి, టీడీపీ కడప జిల్లా పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చౌడం వెంకట కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

