–సేవా స్ఫూర్తితో హారిక హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాంప్..
–ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
ఆర్థిక పరిస్థితులు వైద్యానికి అడ్డంకిగా మారకూడదనే మానవతా దృక్పథంతో ప్రొద్దుటూరులో ఉచిత మెగా వైద్య శిబిరానికి శ్రీకారం చుట్టారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం, వైద్య పరీక్షలు భారంగా మారుతున్న నేపథ్యంలో వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్ డా. అయూబ్ ఖాన్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వహణ, ఉద్దేశ్యం, ప్రజలకు అందించనున్న వైద్య సేవల వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లడం, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలామందికి సాధ్యం కావడం లేదని డా. అయూబ్ ఖాన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అందుకే “వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి” అనే సేవా స్ఫూర్తితో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
డా. అయూబ్ ఖాన్ వివరాలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శిబిరం నిర్వహణను అభినందిస్తూ, తప్పకుండా కార్యక్రమానికి హాజరై ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లో మెగా వైద్య శిబిరం
ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ఆవరణలో హారిక హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. వైద్యులు ఎం. రమేష్, ఎం. నాగయ్య తదితరులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన ఆరోగ్య సూచనలు అందించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు కూడా శిబిరంలో సేవలు అందించనున్నారు.
శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. వీఎస్. ముక్తియార్ పాల్గొననున్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జాకీర్ అహ్మద్, ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాషా, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ ఖలీల్ భాషా, మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మనోహర్ తదితరులు పాల్గొననున్నారు.
కార్యక్రమానికి ఎంపీజే రాయలసీమ ఇన్‌చార్జ్ డా. అయూబ్ ఖాన్, టీడీపీ 18వ వార్డు ఇన్‌చార్జ్ ఎస్.ఎం. లాల్ బాషా సహాయ సహకారాలు అందిస్తున్నారు. శాంతినికేతన్ స్కూల్ హెడ్‌మాస్టర్ షఫీ అహ్మద్, విశ్రాంత ఉపాధ్యాయులు గౌస్ లాజం, ఎస్.పీ. ముక్తియార్, ఫరాన్ తదితరులు సహకరిస్తున్నారు.
సేవా స్ఫూర్తికి ప్రతీకగా..
ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డబ్బు లేక వైద్యం పొందలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి. ఒకరికి ఉచితంగా అందించే వైద్య పరీక్ష.. ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడటం.. ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడటమే.
ఈ ఆలోచనతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం మరిన్ని సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.