SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:32 pm Posted by : SALAM PRODDATUR

డీఎస్సీ అక్రమాలపై పోరాడితే అరెస్టులా..?

–రామసుబ్బారెడ్డి అరెస్టుపై  భగ్గుమన్న   వైఎస్సార్‌సీపీ

–రాజకీయ కక్ష సాధింపులు ఆపాలి..

–ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

సలాం ప్రొద్దుటూరు   (జమ్మలమడుగు):

రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా రామసుబ్బారెడ్డి పాల్గొంటుండగా పోలీసులు అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

అరెస్టు విషయం తెలుసుకున్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. రామసుబ్బారెడ్డి అరెస్టుపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు గౌరవించాలని డిమాండ్ చేశారు.

“డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల గొంతును పోలీసు బలంతో అణచలేరు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుంది” అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశాయి.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.