SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:35 am Posted by : SALAM PRODDATUR

కనుల పండుగగా “హజ్రత్ సయ్యద్ షా నబీ షా ఖాద్రి ఉరఫ్ భం భం పీర్” గంధం మహోత్సవం

– భక్తిశ్రద్ధల మధ్య గంధం సమర్పించిన పీఠాధిపతి సయ్యద్ షా గౌస్ మొహిద్దీన్ ఖాద్రి

 

సలాం ప్రొద్దుటూరు ప్రతినిధి, బనగానపల్లి:

 

నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేటలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దర్గా హజ్రత్ సయ్యద్ షా నబీ షా ఖాద్రి ఉరఫ్ భం భం పీర్ స్వామివారి గంధం మహోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. వేలాదిమంది భక్తులు, శిష్యులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో గంధం మహోత్సవాన్ని తిలకించారు.బుధవారం రాత్రి 11 గంటల నుంచి పకీర్ల మేళా తాళాల నడుమ, మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై నాతే షరీఫ్‌లు, హజ్రత్ దస్తగీర్ స్వామిపై ఖసీదాలు ఆలపిస్తూ గంధాన్ని పీఠాధిపతి నివాసం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. దాదాపు తెల్లవారుజామున 3 గంటలకు బిరాదరే పీఠాధిపతి సయ్యద్ షా గాజీ ఖాద్రి సాహెబ్ ఆధ్వర్యంలో గంధం దర్గాకు చేరుకుంది.పీఠాధిపతి నివాసం నుంచి దర్గా వరకు విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణలు చేయడంతో పాటు దర్గా ప్రాంగణాన్ని రంగురంగుల లైటింగ్‌తో సుందరంగా ముస్తాబు చేశారు. గంధం ఊరేగింపు వీధుల గుండా సాగుతుండగా భక్తులు ఇండ్లపై నుంచి దర్శించుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.అనంతరం పీఠాధిపతి సయ్యద్ షా గౌస్ మొహిద్దీన్ ఖాద్రి సాహెబ్ స్వామివారి మజార్‌కు గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పూల చాదర్లు, గిలాఫ్‌లు సమర్పించి దువా చేశారు.మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధం, జియారత్, ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ షా ఆరిఫ్ ఖాద్రి సాహెబ్,బిరాదరే పీఠాధిపతి సయ్యద్ షా గజాలి ఖాద్రి, దర్గా కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.