SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 5:56 pm Posted by : SALAM PRODDATUR

ఆగస్టు 15 నాటికి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యం–ఎమ్మెల్యే

–ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ పట్టణం సాధ్యం

 

–మెప్మా ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ

– ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు చైతన్యం

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరును పూర్తిస్థాయి ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రొద్దుటూరు పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో గురువారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ నుంచి శివాలయం సెంటర్ వరకు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం, మానవ ఆరోగ్యం, జీవవైవిధ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావాలను ప్రజలకు వివరించారు.ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా విరమించి, గుడ్డ సంచులు, జూట్ బ్యాగులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తేనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రొద్దుటూరును నిర్మించగలమని పేర్కొన్నారు.వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ముందుకు రావాలని ఆయన కోరారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు.ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథం, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు.