SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 8:04 pm Posted by : SALAM PRODDATUR

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి– ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

 

–కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ..

–  కోవిడ్ కారణంగా     నిలిచిన ట్రావెల్ కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని డిమాండ్

సలాం ప్రొద్దుటూరు  ( కడప):

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ (ట్రావెల్ కన్సెషన్)ను తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన లేఖ రాసి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

లేఖలో జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీ చరిత్రను ప్రస్తావించిన ఎంపీ, 1950ల నుంచే ఈ సౌకర్యం అమల్లో ఉందని గుర్తు చేశారు. 2009లో ఫోటో గుర్తింపు కార్డు ఆధారిత కన్సెషన్ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2010లో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఈ రాయితీని విస్తరించినట్లు పేర్కొన్నారు. అనంతరం 2016 నుంచి ఐఆర్‌సీటీసీ (IRCTC) ద్వారా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించడం వల్ల ఈ సేవ మరింత సులభతరమైందని వివరించారు.

అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా రైల్వే శాఖ జర్నలిస్టుల ప్రయాణ రాయితీని తాత్కాలికంగా నిలిపివేసిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినప్పటికీ జర్నలిస్టుల కన్సెషన్ మాత్రం ఇప్పటికీ పునరుద్ధరించకపోవడం విచారకరమని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు నిష్పక్షపాత సమాచారాన్ని అందించే క్రమంలో జర్నలిస్టులు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో రైల్వే ప్రయాణ రాయితీ వారి వృత్తి నిర్వహణకు, సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని ఎంపీ లేఖలో వివరించారు.

గుర్తింపు పొందిన జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే ట్రావెల్ కన్సెషన్‌ను అత్యవసరంగా పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే శాఖను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.