SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 11:15 pm Posted by : SALAM PRODDATUR

గంజాయి, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం–ఎస్పీ

–ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీలు

–ఎన్నికల సన్నద్ధత, పెండింగ్ కేసుల పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, సైబర్ నేరాల నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు

 

సలాం ప్రొద్దుటూరు :

 

ప్రజలకు న్యాయం అందించే కేంద్రాలుగా పోలీస్ స్టేషన్లు పనిచేయాలని, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడం, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలోని వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ట్రాఫిక్, రూరల్, రాజుపాలెం పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.తనిఖీల సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, పెండింగ్ కేసుల ఫైళ్లు, దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిశుభ్రత, రిసెప్షన్ వ్యవస్థ, సిబ్బంది హాజరును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో అలసత్వం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే వృత్తిపరమైన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గంజాయిపై డ్రోన్లతో ప్రత్యేక నిఘా

ప్రొద్దుటూరు పట్టణంలో గంజాయి నిర్మూలన కోసం రెండు డ్రోన్లతో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంజాయి సాగు, రవాణా, నిల్వ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం కావాలి

రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు స్థాయిలో పోలీస్ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయి సమాచారం సేకరించాలని, ప్రశాంత, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఎస్పీ ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ల (VPO) పనితీరును సమీక్షించి, మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా పలు సూచనలు చేశారు.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

రౌడీషీటర్లు, పాత నేరస్థులు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దొంగతనాలు, ఇతర నేరాల నివారణకు డే బీట్, నైట్ బీట్‌లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్లు ప్రజలకు భరోసా కలిగించే కేంద్రాలుగా మారాలి

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, అవసరమైతే నైట్ హాల్ట్‌లు నిర్వహించాలని సూచించారు. తనిఖీల అనంతరం ప్రొద్దుటూరు వన్‌టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటి పచ్చదన పరిరక్షణకు శ్రీకారం చుట్టిన ఎస్పీ, పోలీస్ స్టేషన్లు పరిశుభ్రమైన, ప్రజలకు భరోసా కలిగించే సేవా కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.ఈ తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, డీఎస్పీ కె. వెంకటేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ వెంకట కొండారెడ్డి, టూ టౌన్ సీఐ వంశీనాథ్, త్రీ టౌన్ సీఐ రామాంజనేయులు, ట్రాఫిక్ సీఐ భాస్కర్, రూరల్ సీఐ నాగభూషణ్‌తో పాటు సంబంధిత పోలీస్ అధికారులు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.