SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 12:32 pm Posted by : SALAM PRODDATUR

ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది– రాచమల్లు

 

–’వాతలు, కోతలు, ఎగవేతలే పాలన..

–ప్రచారం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు’

– దొరసానిపల్లెలో మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాచమల్లు

సలాం ప్రొద్దుటూరు, దొరసానిపల్లె:

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. బుధవారం దొరసానిపల్లెలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. 26 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒక్క రూపాయి కూడా అందలేదని ప్రజలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, రైతులకు , “తల్లికి వందనం”, నేతన్నలు, ఇతర వర్గాలకు ప్రకటించిన పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “తల్లికి వందనం” పథకం కింద రెండో ఏడాది కొంతమందికి రూ.13 వేల చొప్పున, మరికొందరికి అంతకంటే తక్కువ మొత్తాలు జమయ్యాయని తెలిపారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇప్పటికీ చెల్లించలేదన్నారు. ఒక్కో నిరుద్యోగికి సుమారు రూ.78 వేల బకాయిలు ఉన్నాయని ఆరోపించారు.

ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత తొలి ఏడాది నుంచే అమలు చేశారా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని రాచమల్లు కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాలనలో మొదటి ఏడాది నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లపాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది హామీలను అమలు చేయకుండా, రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సుమారు రూ.1.31 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించారని, 8 కోట్ల 89 లక్షల మంది లబ్ధిదారులకు, 1 కోటి 41 లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు కూడా పలు పథకాల ద్వారా ప్రయోజనం పొందారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో రూ.3.65 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, అప్పులు చేయడంలో, ఆర్భాటపు ప్రకటనలు చేయడంలో, రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని రాచమల్లు ఆరోపించారు. అవినీతి, అబద్ధాలు, మోసం, వెన్నుపోటు రాజకీయాలే ప్రస్తుత ప్రభుత్వ అజెండాగా మారాయని విమర్శించారు. సంపద సృష్టిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం నుంచి ప్రజలకు ఆశించిన స్థాయిలో సహాయం అందడం లేదని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కొండంత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత గోరంత మాత్రమే అమలు చేశారని ఆరోపించిన ఆయన, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.