–52 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, రూ.9,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలుకు డిమాండ్
– ఆగస్టు 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
సలాం ప్రొద్దుటూరు:
మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపి, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు 52 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి అమలు చేయాలని కోరారు.
మంగళవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. పరీక్ష నిర్వహణలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో 52 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, రెండేళ్లు గడిచినా కేవలం 16 వేల పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం నిరుద్యోగులకు అన్యాయం చేశిందని విమర్శించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేశారనే ఆరోపణలు వెలువడటం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెల్లించాల్సిన రూ.9,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్థిక భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడటంతో పేద విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై చేస్తున్న ప్రకటనలకు స్పష్టమైన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆ పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాచమల్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం, నిరసన ర్యాలీలు చేపట్టడం వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొని తమ హక్కుల సాధనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.