SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 4:32 pm Posted by : SALAM PRODDATUR

శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గంగమ్మ తల్లి

 

సలాం ప్రొద్దుటూరు:

 

ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బజార్ వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో అమ్మవారిని శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, హారతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

 

అమ్మవారిని శాకాంబరి రూపంలో దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబాల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధి కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకపోకలతో సందడిగా మారగా, ఆలయ నిర్వాహకులు దర్శన ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించారు.

 

ఆషాఢ శుక్రవారం సందర్భంగా జరిగిన ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ శాకాంబరి దేవి రూపంలో గంగమ్మ తల్లి దర్శనం పొందిన భక్తులు అమ్మవారి కృప అందరిపై ఉండాలని ప్రార్థించారు.