SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:37 pm Posted by : SALAM PRODDATUR

అవినీతిని అరికట్టలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి– కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా

 

–బెట్టింగ్, భూ మాఫియా, ఆక్రమణలు, కాంట్రాక్టర్ల బిల్లులు, అధికారులపై ఒత్తిళ్లపై తీవ్ర ఆరోపణలు

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరులో అవినీతి విస్తృతంగా ఉందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచిన తర్వాత అవినీతి ఉందని చెప్పడం పరిపాలనా వైఫల్యాన్ని అంగీకరించినట్లేనని విమర్శించారు.

 

‘అవినీతి ఉందని మీరే చెబితే బాధ్యత మీదే’

 

సొంత ప్రభుత్వంలో, సొంత నియోజకవర్గంలో అవినీతి జరుగుతోందని ఎమ్మెల్యే స్వయంగా అంగీకరిస్తే, ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నైతిక హక్కు ఉండదని ఇర్ఫాన్ బాషా అన్నారు. ప్రజాప్రతినిధిగా అవినీతిని అరికట్టడంలో విఫలమైతే పదవికి రాజీనామా చేసి సమర్థుడైన నాయకుడికి అవకాశం కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

 

బెట్టింగ్, భూ మాఫియాపై ప్రశ్నల వర్షం

 

గతంలో బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం అలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నవారు తమ పార్టీలో లేరా అని ప్రశ్నించారు. అలాగే భూ మాఫియాపై చర్యలు తీసుకుంటామని చెప్పిన నాయకత్వం, తమ పార్టీకి చెందిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

 

ఆక్రమణలు, కాలనీలు, కాంట్రాక్టర్ల బిల్లుల అంశాలు ప్రస్తావన

 

అమృతనగర్‌లో జరుగుతున్న ఆక్రమణలు, కబ్జాలు, దౌర్జన్యాలు ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, జగన్ అన్న కాలనీల్లో విచారణ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నది అధికార పక్షమేనని ఆరోపించారు. అలాగే ప్రొద్దుటూరు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల బిల్లులను అవినీతి, విచారణ పేరుతో నిలిపివేశారని విమర్శించారు.

 

అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఇప్పుడు ఆరోపణలా?

 

అధికారులను బదిలీల పేరుతో బెదిరించి రాజకీయ ఒత్తిళ్లకు గురిచేసిన తర్వాత, ఇప్పుడు వారిపైనే అవినీతి ఆరోపణలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఇర్ఫాన్ బాషా విమర్శించారు. స్వేచ్ఛగా పనిచేయాల్సిన అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, అనంతరం వారినే తప్పుబట్టడం సరైన విధానం కాదన్నారు.

 

కాంగ్రెస్ డిమాండ్

 

ప్రొద్దుటూరులో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, అవినీతిని అరికట్టలేకపోయామని స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టమైన డిమాండ్ చేస్తున్నామని ఇర్ఫాన్ బాషా పేర్కొన్నారు.