SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 3:48 pm Posted by : SALAM PRODDATUR

అవినీతి ఆరోపణల నడుమ.. కొత్తపల్లి విలీనంపై పునరాలోచన చేయాలి–మల్లెల ఝాన్సీ 

 

–అవినీతి ఆరోపణలతో విలీనంపై రాజకీయ దుమారం..

–ప్రభుత్వం ముందు అవినీతి అధికారులపై చర్యలు.. తర్వాతే గ్రామాల విలీనంపై నిర్ణయం తీసుకోవాలని

–మాజీ ఎంపీపీ మల్లెల ఝాన్సీ రాణి డిమాండ్

 

సలాం ప్రొద్దుటూరు: 

 

ప్రొద్దుటూరులో ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, కొత్తపల్లి గ్రామపంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై మాజీ ప్రొద్దుటూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మల్లెల ఝాన్సీ రాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మల్లెల ఝాన్సీ మాట్లాడారు.బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వాటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

 

ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి

 

ప్రభుత్వ శాఖల్లో లంచాలు ఇవ్వకుండా పనులు జరగడం లేదని, అవినీతి నిరోధక వ్యవస్థ పనితీరుపైనా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేశాయని ఝాన్సీ రాణి పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులను గుర్తించి, వారి వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా విచారించి, సంబంధిత వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు.

 

గ్రామసభలో కమిషనర్ వ్యాఖ్యలు ప్రస్తావన

 

ఈ నెల 28న కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో మున్సిపల్ కమిషనర్ కూడా అవినీతి అంశాన్ని ప్రస్తావించారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో మరింత అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా, ఇటీవల రోడ్ల నిర్మాణ నాణ్యతపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలను కూడా ఆమె గుర్తు చేశారు.

 

విలీనానికి ముందు పారదర్శక పాలన అవసరం

 

ఇలాంటి పరిస్థితుల్లో కొత్తపల్లి గ్రామపంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడం గ్రామ ప్రజల ప్రయోజనాలకు అనుకూలం కాదని ఝాన్సీ రాణి అభిప్రాయపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిపాలనా వ్యవస్థలో గ్రామాలను విలీనం చేయడం కంటే, ముందుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించే పరిస్థితి ఏర్పడిన తర్వాతే విలీనంపై ముందడుగు వేయాలని సూచించారు.

 

రాజకీయ ప్రయోజనాల కంటే గ్రామ భవిష్యత్తు గురించి ఆలోచించాలి

 

రాజకీయ ప్రయోజనాల కంటే గ్రామ భవిష్యత్తు, ప్రజల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం దీని పై మరోసారి ఆలోచించాలనీ మల్లెల ఝాన్సీ రాణి అభిప్రాయం వ్యక్తం చేశారు.వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కంటే గ్రామ భవిష్యత్తు, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు.గ్రామ అభివృద్ధి, ప్రజల హక్కులు, భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.

 

ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకోవాలి

 

మంచి పాలన అందిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా తన నిబద్ధతను నిరూపించుకోవాలని మల్లెల ఝాన్సీ రాణి కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే అవినీతిపై రాజీ లేని వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.