సలాం ప్రొద్దుటూరు :
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవను తమ ప్రధాన బాధ్యతగా భావించి నిజాయితీ, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని లంచాలకు దూరం ఉండాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హితవు పలికారు .బుధవారం స్థానిక నెహ్రూ రోడ్ లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.ప్రజల నుంచి లంచాలు ఆశించడం ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొంటూ, అవినీతికి తావులేకుండా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం
“లంచాలు తీసుకోవడానికే స్వాతంత్య్రం వచ్చిందా?” అంటూ ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు
ప్రొద్దుటూరు, జూలై 29: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించి అవినీతికి పాల్పడటం ఆందోళనకరమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“స్వాతంత్య్రం వచ్చింది లంచాలు తీసుకోవడానికా?”
కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారశైలిని చూస్తే స్వాతంత్య్రం వచ్చింది లంచాలు తీసుకోవడనికే అనే చందంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ సిబ్బంది అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం బాధాకరమని అన్నారు.సబ్ రిజిస్ట్రార్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో లంచగొండితనం మరింత పెరిగిందని ఆరోపించిన వరదరాజుల రెడ్డి, ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ, కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఉద్యోగులు లంచాలకు పూర్తిగా దూరంగా ఉండి బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అదే సమయంలో అవినీతిని సహించకుండా ప్రజలు కూడా చైతన్యంతో ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.