SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:07 am Posted by : SALAM PRODDATUR

గంజాయి, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

–సమాచారం అందించేందుకు 1972 హెల్ప్‌లైన్ వినియోగించాలి– సీఐ కొండారెడ్డి

సలాం ప్రొద్దుటూరు:

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రొద్దుటూరు వన్ టౌన్ సఐ కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నానగర్‌లో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కడప జిల్లా ఎస్పీ నచికేత్ (ఐపీఎస్), ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ (ఐపీఎస్) ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం, చట్టపరమైన పరిణామాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఒకటో పట్టణ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ, తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను సేవించడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా సరఫరా చేయడం గమనించినట్లయితే వెంటనే 1972 హెల్ప్‌లైన్‌కు లేదా డయల్ 100, 112, లేదా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

ప్రజలు అందించే సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, సమాచారం ఆధారంగా నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి తగిన ప్రోత్సాహం కూడా అందజేస్తామని సీఐ పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.