సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లాలోని లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళలు తీవ్ర ఆర్థిక, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు., పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్య అవసరాలు, స్వయం ఉపాధి కోసం తీసుకున్న రుణాల భారంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయంతో పాటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లించలేక మహిళలు మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో ప్రతి నెలా రూ.1,500 జమ చేసేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, పొదుపు సంఘాల మహిళలకు ప్రకటించిన రుణ మాఫీ, వడ్డీ మాఫీ హామీలను కూడా ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో జాప్యం కారణంగా అదనపు వడ్డీ భారం పడుతూ మహిళలు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇటీవల అమలు చేస్తున్న పొదుపు మహిళల యాప్ కారణంగా అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని షేక్ ముంతాజ్ బేగం ఆరోపించారు. పదేపదే నమోదు చేయించడం, అనవసర ధ్రువీకరణలు, సర్వర్లు పనిచేయకపోవడం, అధికారుల వేధింపులు, కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సిన పరిస్థితులు మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. యాప్‌లోని సాంకేతిక లోపాలను వెంటనే సరిదిద్ది, అనవసర నమోదులు, తనిఖీలు, అధికారుల వేధింపులను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పొదుపు సంఘాల అసలు లక్ష్యం మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అభివృద్ధి అని, ప్రస్తుతం అమలవుతున్న విధానాలు ఆ లక్ష్యానికి విరుద్ధంగా మహిళలకు మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆమె విమర్శించారు. మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, సరళత ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
జిల్లా స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి మహిళల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పొదుపు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని ఐద్వా డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికల హామీలను అమలు చేయాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా మహిళలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ ముంతాజ్ బేగం హెచ్చరించారు.