SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 12:48 am Posted by : SALAM PRODDATUR

మహిళా హక్కుల సాధనకు మహిళలు ఐక్యంగా పోరాడాలి

–మహిళా హక్కుల సాధనకు మహిళలు ఐక్యంగా పోరాడాల

 

–అన్ని రంగాల్లో మహిళలు నాయకత్వం వహించాలి: ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కన్వీనర్ కె. సుబ్బరాయుడు

 

సలాం ప్రొద్దుటూరు (నంద్యాల):

మహిళల హక్కుల సాధన కోసం మహిళలు మరింత ఐక్యంగా ఉద్యమించి, సమాజంలోని అన్ని రంగాల్లో నాయకత్వ పాత్ర పోషించాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) రాష్ట్ర కన్వీనర్ కె. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు.

 

నంద్యాల పట్టణంలోని ఆర్‌ఎస్‌పీ కార్యాలయంలో యునైటెడ్ మహిళా సంఘం (యూఎంఎస్) నంద్యాల టౌన్ మహాసభ సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కె. సుబ్బరాయుడుతో పాటు ఆర్‌ఎస్‌పీ కర్నూలు జిల్లా కార్యదర్శి ఆనంద్, పార్టీ నాయకుడు నంద్యాల సుబ్బరాయుడు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశంలో మహిళలపై వివక్ష, వేధింపులు, హింస, అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను నిర్మూలించాలంటే మహిళా ఉద్యమాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉపాధి, రాజకీయాలు, సామాజిక సేవ, విజ్ఞానశాస్త్రం, పరిశ్రమలు తదితర అన్ని రంగాల్లో మహిళలు ముందుండి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

 

మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్న ఆయన, మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత ద్వారానే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.

 

మహిళల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఉద్యమాలు చేపట్టాలని, అధిక సంఖ్యలో మహిళలు సంఘంలో చేరి ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆయన కోరారు.

 

అనంతరం యూఎంఎస్ నంద్యాల టౌన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టౌన్ అధ్యక్షురాలిగా వెంకటసుబ్బమ్మ, కార్యదర్శిగా లక్ష్మి, ఉపాధ్యక్షులుగా మేరీ, గురుభారతి, సువర్ణ, సహాయ కార్యదర్శులుగా ముంతాజ్, పద్మ, కార్యవర్గ సభ్యులుగా మంజుల, నసీమ, రేష్మ, మద్దమ్మ, లక్ష్మీదేవి, పోలమ్మ, సుబ్బమ్మలను ఎన్నుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో యునైటెడ్ మహిళా సంఘం మహిళా కార్యకర్తలు, పార్టీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.