SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 12:41 am Posted by : SALAM PRODDATUR

పంచాయతీలను విలీనం చేసి ప్రొద్దుటూరుకు కార్పొరేషన్ హోదా కల్పించాలి

 

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేసి పట్టణానికి కార్పొరేషన్ హోదా కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత నాగమునిరెడ్డి, సినీ హబ్ రాజేశ్వర రెడ్డి ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.

 

ఈ సందర్భంగా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లెతో పాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధికి ఆనుకుని ఉన్న ఇతర గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేయాలని సూచించారు. విలీన ప్రక్రియ పూర్తయిన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రొద్దుటూరుకు కార్పొరేషన్ హోదా కల్పిస్తే పట్టణ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

 

పంచాయతీల విలీనంతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదనకు స్థానిక ప్రజల నుంచి కూడా విస్తృత మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు.

 

ప్రొద్దుటూరును “మినీ ముంబై”గా పిలుస్తారని, వైఎస్సార్ జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ పంచాయతీ పాలనలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరానికి సమానంగా జనాభా పెరిగినా డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పంచాయతీల విలీన ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.