SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:43 pm Posted by : SALAM PRODDATUR

“పంచాయతీని కాపాడుకుందాం.. విలీనంపై ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి”–మాజీ సర్పంచ్ కొనిరెడ్డి

 

–గ్రామ పంచాయతీ వ్యవస్థతోనే ప్రజలకు మెరుగైన సేవలు

 

సలాం  ప్రొద్దుటూరు:

కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై నిర్వహించిన గ్రామసభలో  మంగళవారం మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీ వ్యవస్థకు మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండే స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అని, విలీనం వల్ల కలిగే లాభనష్టాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్డు లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను స్థానికంగానే వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. గ్రామస్థులకు ఏ సమస్య వచ్చినా పంచాయతీ కార్యాలయంలోని   అధికారులను నేరుగా కలిసి వెంటనే పరిష్కారం పొందవచ్చని, ప్రజలకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు.

మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండగా, కొత్తపల్లి పంచాయతీలో ప్రతిరోజూ తాగునీరు అందుతోందని పేర్కొన్నారు. పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైతే చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాను సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించానని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తించాలని కోరారు. పంచాయతీ వ్యవస్థ కొనసాగితేనే గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారని, ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ కొనసాగడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు, స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారం, గ్రామ అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.