–స్మశానానికి రెండు ఎకరాల భూమి కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలి: సీఐటీయూ
సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు):
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం వివి కండ్రిక గ్రామంలోని దళితులకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయడంతో పాటు గ్రామ స్మశానాన్ని అభివృద్ధి చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ఎదుట దళితులతో కలిసి ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
గ్రామ సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మినహా అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంపై సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన “ప్రజల వద్దకు పాలన” నినాదం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రజలు చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో నాయకులు మాట్లాడుతూ, గ్రామంలోని సుమారు 100 దళిత కుటుంబాలకు సాగుభూమి లేకపోవడంతో కూలీ పనులు, ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను అగ్రవర్ణాల వారు అక్రమంగా ఆక్రమించి మామిడి తోటలు సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో ఇప్పటికీ కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతున్నాయని, దళితులకు వివక్షపూరిత వ్యవహారం జరుగుతోందని పేర్కొన్నారు.
గ్రామ స్మశానం ఆక్రమణకు గురైందని, ప్రస్తుతం ఉన్న 40 సెంట్ల స్థలం సరిపోవడం లేదని తెలిపారు. స్మశానానికి కనీసం రెండు ఎకరాల భూమిని కేటాయించి బోరు, భవనం, రహదారి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే దళితులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడం, ఆక్రమణకు గురైన గ్రామ దారులను సర్వే చేసి పునరుద్ధరించడం, గ్రీవెన్స్ అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులు అందజేయాలని కోరారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ, వివి కండ్రిక దళితవాడ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గ్రామంలో వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, బోరు మరమ్మతులు, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దళిత గ్రామాల అభివృద్ధికి కేటాయించే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హరిత రెడ్డి హామీ ఇచ్చినట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పి. జాన్ ప్రసాద్, కో-కన్వీనర్ నగిరిపాటి ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోడీ అనిల్, సుబ్రహ్మణ్యం, చంటి రాధిక, సునీత, ఈశ్వరమ్మ, పరమేష్, ప్రసాద్‌తో పాటు అధిక సంఖ్యలో దళిత మహిళలు పాల్గొన్నారు.