SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 8:17 pm Posted by : SALAM PRODDATUR

కార్పొరేషన్ హోదాతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.. వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి

–విలీనానికి సహకరించాలనీ గ్రామసభలో బసిరెడ్డి  పిలుపు

 

సలాం ప్రొద్దుటూరు: 

 

కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసి, భవిష్యత్తులో కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లడం ద్వారానే గ్రామానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామసభలో వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

మంగళవారం నిర్వహించిన    గ్రామసభలో ఆయన మాట్లాడుతూ  గతంలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ గ్రామాభివృద్ధిపై సమిష్టిగా చర్చించి కార్యాచరణ చేపట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే పెద్ద స్థాయిలో నిధులు అవసరమని, అవి కార్పొరేషన్ ద్వారా సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

 

కార్పొరేషన్ హోదా లభిస్తే రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం నుంచి అధిక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 

గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కార్పొరేషన్ స్థాయికి ఎదిగే లక్ష్యంతో విలీన ప్రక్రియకు సహకరించాలని ఆయన గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. తాను వృత్తిపరంగా వ్యాపారవేత్తనైనా, వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా ప్రజలంతా కలిసి గ్రామ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.